Political News

సౌదీలో అంతే.. తాజాగా ముగ్గురు యువరాజులు అరెస్ట్

కొన్ని దేశాల్లో వ్యవస్థలు భలే సిత్రంగా ఉంటాయి. భారత్ లాంటి దేశంలో బతుకుతుంటాం కాబట్టి.. చాలామంది చాలా విషయాల్ని పట్టించుకోరు. ధర్నా చేసేందుకు.. రాస్తారోకో చేసేందుకు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టేందుకు ప్రయత్నించటం.. పోలీసులు అదుపులోకి తీసుకున్నంతనే.. నానా యాగీ చేసేస్తాం. మా హక్కులు ఏమయ్యాయి? అంటూ మండిపడతాం. సామాన్యులుగా మనకుంటే పరిమితమైన హక్కులకే ఇంతలా చెలరేగిపోతాం. అలాంటి వాటిని పెద్ద పెద్ద ఫోటోలతో మీడియా కూడా అచ్చేస్తుంది.

సామాన్యులుగా మనకింత పవర్ ఉంటే.. మన పొరుగున ఉండే సౌదీ అరేబియా లాంటి దేశంలో పరిస్థితులు చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే. ఆ దేశంలోని యువరాజుల పరిస్థితి చూస్తే సిత్రంగా అనిపిస్తుంటుంది. పేరుకు యువరాజులే కానీ.. ఎప్పుడు అరెస్టు అవుతారో? మరెప్పుడు విడుదల అవుతారో అస్సలు అర్థం కాదు.

తాజాగా అలాంటి పరిస్థితే మరోసారి చోటు చేసుకుంది. సౌదీ అరేబియా రాజును గద్దె దింపేందుకు కుట్ర పన్నుతున్నారన్న ఆరోపణలతో ఆ దేశ అధికారులు ముగ్గురు యువరాజుల్ని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన కథనాల్ని అమెరికా మీడియా సంస్థలు ప్రచురించాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం శుక్రవారం ఉదయం ముగ్గురుయువరాజుల్ని వారి ఇళ్ల నుంచి అరెస్టు చేసినట్లుగా వెల్లడించింది.

అరెస్టు అయిన వారిలో రాజు సల్మాన్ తమ్ముడు అహ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్.. దగ్గర బంధువు మహమ్మద్ బిన్ నయేఫ్.. నవాఫ్ బిన్ నయేఫ్ లు ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది. తాజాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కుట్ర అంశం నిజమని తేలితే.. నిందితులకు జీవితకాల ఖైదు లేదంటే మరణశిక్షకు అవకాశం ఉంది. పేరుకు యువరాజులే కానీ.. వారి పరిస్థితితో పోలిస్తే.. మనమెంత మెరుగ్గా బతుకుతున్నామో కదా?

 Political News
Hariyan Srinivas
  Political News
Mar 08, 2020
  Political News
Political News