Life Style

ఇన్సూరెన్స్ చాలా అవసరం.

వైద్య బీమా నేటి రోజుల్లో ఎంతో కీలకమైనదని, ముఖ్యంగా వైద్య పరంగా అత్యవసర పరిస్థితుల్లో దీని అవసరం ఎంతో ఉందని ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్‌ అండ్‌ అండర్‌ రైటింగ్స్‌ చీఫ్‌ సంజయ్‌ దత్తా పేర్కొన్నారు. వైద్య బీమా అవసరం ఏ మేరకు, అది ఏ విధంగా ఓ కుటుంబాన్ని ఆదుకుంటుందన్న విషయాల గురించి ఆయన ఇలా వివరించారు. బేసిక్‌ హెల్త్‌ ఇండెమ్నిటీ పాలసీ హాస్పిటల్‌ పాలైనప్పుడు కవరేజీనిస్తుంది. డాక్టర్‌ ఫీజులు, వైద్య చికిత్సల వ్యయాలను చెల్లిస్తుంది. భారతీయులకు హెల్త్‌ ఇన్సూరెన్స్ అవసరం. ఎందుకంటే అధిక రిస్క్‌తో కూడిన జీవన శైలి వ్యాధులు స్థూలకాయం, రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బుల బారిన పడడం పెరిగిపోతోంది. ఆహార అలవాట్లు, జీవనశైలిలో మార్పులు, ఉదయం వేళల్లో ఒత్తిడి, పట్టణీకరణ పెరిగిపోవడం వంటివి వీటికి కారణాలు. మరోవైపు గత కొన్నేళ్లలో వైద్య వ్యయాలు రాకెట్‌లా పెరిగిపోయాయి. ఏటేటా వైద్య ద్రవ్యోల్బణం 7–8 శాతం ఉందని ఎన్నో నివేదికలు చెబుతున్నాయి. భారతీయులు వైద్య చికిత్సల కోసం అయ్యే వ్యయాల్లో 70 శాతాన్ని తమ జేబుల నుంచి ఖర్చు చేస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నివేదిక చెబుతోంది. ఊహించని వైద్య అవసరాలు ఎదురైతే కుటుంబ బడ్జెట్‌ మొత్తానికి పెద్ద చిల్లు పడుతుంది. అందుకే హెల్త్‌ ఇన్సూరెన్స్ అన్నది చాలా అవసరం.

ప్రయోజనాలు

తీవ్రమైన అనారోగ్యాలు, వైద్య ఖర్చులు, నగదు రహిత చికిత్సలతోపాటు, పన్ను ఆదా వంటి ప్రయోజనాలు వైద్య బీమాతో ఉన్నాయి. ఉద్యోగులకు తమ సంస్థ తరఫున బృంద బీమా పాలసీ ఉన్నా కానీ, విడిగా తమ కుటుంబానికి ఓ పాలసీ తీసుకోవాలి. చిన్న వయసులో ఉన్న వారు సాధారణంగా మంచి ఆరోగ్యంతో ఉన్నామని భావిస్తుంటారు. వారు వ్యాయామం చేయడంతోపాటు, ఆరోగ్యకరమైన ఆహారం, చెడు అలవాట్లు లేకపోవడం లేదా ఉన్నా కానీ పరిమిత అలవాట్లతో వారికి వైద్య బీమా ఆ వయసులో అవసరం అనిపించకపోవచ్చు. కానీ, గమనించాల్సిన అంశం ఏమిటంటే ఇలా ఆరోగ్యంగా ఉన్నప్పుడే, ఎటువంటి వైద్య సమస్యల్లేని సమయంలోనే హెల్త్‌ పాలసీ తీసుకోవడం మంచిది. అందుకే చిన్న వయసులోనే వైద్య బీమా పాలసీ తీసుకోవాలని సిఫారసు చేస్తుంటారు. దీనివల్ల పెద్ద వయసులో తీసుకునే పాలసీతో పోలిస్తే తక్కువ ప్రీమియానికే సమగ్ర కవరేజీతో కూడిన పాలసీ లభిస్తుంది. వయసుతోపాటు వైద్య బీమా పాలసీ కొనుగోలు వ్యయం కూడా పెరిగిపోతుంది. ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దీ వైద్య సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. దీనివల్ల ప్రీమియం కూడా ఎక్కువవుతుంది. చిన్న వయసులోనే వైద్య బీమా పాలసీ తీసుకోవడానికి ఉన్న మరో కారణం... క్యుమిలేటివ్‌ బోనస్‌ను పొందొచ్చు. చిన్న వయసులో ఉన్న వారు క్లెయిమ్స్‌ చేసుకునే అవకాశాలు తక్కువ. క్యుములేటివ్‌ బోనస్‌ 50 శాతం వరకు సమ్‌ ఇన్సూర్డ్‌ మొత్తంలో లభిస్తుంది. దీంతో మీ వైద్య బీమా మొత్తం 150 శాతం అవుతుంది. కానీ ప్రీమియం మాత్రం 100 శాతం బీమాకు చెల్లిస్తే చాలు. చిన్న వయసులోనే ఎందుకు వైద్య బీమా తీసుకోవాలన్న దానికి ఇవి కొన్ని కారణాలు మాత్రమే. ఓ కుటుంబానికి ఆధారమైన వారు కుటుంబమంతటికీ కలిపి ఫ్యామిలీ ఫ్లోటర్‌ హెల్త్‌ పాలసీ తీసుకోవాలి. ప్రజలు వైద్య బీమాను దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్‌గా చూడాలి. తగినంత వైద్య బీమా కవరేజీ ఉన్న వారు ప్రశాంతంగా ఉండొచ్చు. ఆర్థిక భద్రతను కూడా ఇస్తుంది. అయితే, కొందరు తమకు వైద్య సమస్యలు ఆరంభమైన తర్వాతే వైద్య బీమా అవసరాన్ని గుర్తిస్తుంటారు. అందుకే ఆలస్యం చేయకుండా వైద్య పాలసీ తీసుకోవాలి.

 Life Style
Hariyan Srinivas
 Life Style
Mar 08, 2020
 Life Style
Life Style